Movie Reviews

Gautamiputra Satakarni


<!–

Overview

–>

<!–

Biography:

–>

సాహసం లేని వాడు రాజుగా రాణించలేడు!అదే సాహసం లేని వాడు స్టార్ గానూ రాణించలేడు! నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ వందో సినిమా ఇందుకు చక్కటి ఉదాహరణ! శత చిత్రాల కథానాయకుడు అనిపించుకున్న బాలయ్య శాతకర్ణీ వృత్తాంతంతో తన సత్తా చాటాడు. సాహసంతో చారిత్రక నేపథ్యం వున్న సినిమా చేసి సాహో అనిపించుకున్నాడు. 99సినిమాల తరువాత ఆయన చేసిన 100వ సినిమా ఆ సంఖ్యకు తగ్గట్టే విశేషంగా, విశిష్టంగా విస్మయం కలిగిస్తూ అలరిస్తోంది… అశేష తెలుగు ప్రేక్షకుల్ని!

కథ :

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తొలి తెలుగు చక్రవర్తి కథ. నిజానికి యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన తొలి సామ్రాట్టు కథ.భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఏకఛ్ఛత్రాధిపత్యం వహించిన వీరుడి కథ. గౌతమి బాలాశ్రీ తనయుడుగా శాతవాహనుల వంశంలో ఉద్భవించిన శాతకర్ణి చిన్నప్పట్నుంచే ఒక స్థిరమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పిస్తాడు. అందుకు మార్గం తన ప్రతాపమే అని నమ్మి వరుస యుద్ధాలు చేస్తాడు. వాటి ఫలితంగా మూడు సముద్రాల మధ్యనున్న భారత భూమండలమంతా ఆయన గుర్రపు డెక్కల కిందకి చేరిపోతుంది. చివరగా, గౌతమీ పుత్ర శాతకర్ణి అఖండ సామ్రాజ్యాన్ని కబలించ వచ్చిన విదేశీ మూకల్ని సైతం ఆయన ధీటుగా ఎదుర్కొంటాడు.దేశం మీసం తిప్పుదాం అన్న డైలాగ్ సాక్షిగా శాలివాహన శకానికి నాంది పలుకుతాడు…

Analysis :

ఎనాలిసిస్ :

విశ్లేషణ :

ఈ కాలం హీరోలు తమ కెరీర్లో వంద సినిమాలు చేయటం దాదాపూ అసాధ్యం. కాని, బాలయ్య తండ్రి నుంచి వారసత్వాన్ని, నట వారసత్వాన్ని సమర్థంగా అందుకున్న అసలు సిసలు వంశోధ్దారకుడు. అందుకే, తాతమ్మ కల మొదలు ఈనాటి గౌతమీ పుత్ర శాతకర్ణి వరకూ జయాపజయాలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ముందుకు సాగిపోతున్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు వందో చిత్రపు మైలురాయి దాటాడు. తెలుగు వారి ప్రపథమ చక్రవర్తి శాతకర్ణి జీవితాన్ని, వీరత్వాన్ని, రాజసాన్ని తెరపై ఆవిష్కరించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అసలు ఈ తరం తెలుగు హీరోల్లో చరిత్రాత్మక చారిత్రక సినిమా చేసిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టించాడు.

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేయటం మామూలు విషయం కాదు. సాహసం. ఎందుకంటే, ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకి నచ్చటం కంటే నచ్చకపోయే అవకాశాలు ఎక్కువ. అయినా హీరో, డైరెక్టర్ తెగించి తెరపైన అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒకవైపు రాజు, రాజ్యం, యుద్ధాలు చూపిస్తూనే మరో వైపు ఆ మహారాజు వ్యక్తిగత జీవితం, కుటుంబం, భార్య, తల్లి మొదలైన కోణాల్ని స్ప్రుశించాడు దర్శకుడు. యుద్ధానికి యుద్ధానికి మధ్య రాజ సౌధాల్లో జరిగే సంఘర్షణను ఆసక్తికరంగా తెరకెక్కించాడు.

గౌతమీ పుత్ర శాతకర్ణి తెలుగు ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రమే అయినా యుద్ధ సన్నివేశాల్లో కాస్తంత గాఢత ఎక్కువ వుండాల్సింది. ఎమోషనల్ గా ఆడియన్స్ యుద్ధాల సమయంలో సినిమాతో అవ్వాల్సినంత కనెక్ట్ అవ్వలేరు. క్రిష్ యుద్ధాల్ని టెక్నికల్ గా తీస్తూ సాగిపోయాడు. అలా కాకుండా మరింతగా భావోద్వేగాలు కలగలిపి వుంటే కథతో మరింత బాగా కలిసిపోయేవి.దీని వల్ల వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి సినిమాలు తీసిన క్రిష్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే డ్రామా, ఎమోషన్ కాస్త కొరవడుతూ వచ్చింది సినిమాలో.

నటీనటులు :

తెరపైన జరిగిన అద్భుతంలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది శత చిత్ర కథానాయకుడు బాలకృష్ణ గురించే. సినిమా మొత్తం ఆయనే స్వైర వీహారం చేశాడు. తనదైన రీతిలో అభినయనం, సంభాషణ ప్రేక్షకులపై ప్రయోగిస్తూ సమ్మోహన పరిచాడు. వంద చిత్రాల అనుభవం బాలయ్య అణువణువునా ప్రదర్శించాడు. ఇక బాలీవుడ్ లెజెండ్రీ యాక్ట్రస్ హేమామాలిని గౌతమీ బాలాశ్రీగా అవలీలగా నటించింది. హుందాగా కొడుకును వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఒక నూతన శకానికి నాంది పలికించే మాతృమూర్తిగా అదరహో అనిపించింది. బాలకృష్ణ, హేమామాలిని లాంటి అపార అనుభవం వున్న ఇద్దరి మధ్యనా హీరోయిన్ శ్రియా కూడా గొప్పగా నటించింది. ఎన్నో గ్లామర్ పాత్రలు పోషించిన ఆమె వశిష్టీ దేవిగా విశిష్టంగా అలరించింది. ముఖ్యంగా, శాతకర్ణి తరువాతి రారాజు పులమావికి తల్లిగా శ్రియా చక్కగా ఎమోషన్స్ పండించింది. శృంగారం నుంచి వాత్సల్యం వరకూ ఆమె అన్ని షేడ్స్ తో మెప్పించింది.

సాంకేతిక వర్గం :

గౌతమీ పుత్ర శాతకర్ణి తెరపై సంచలనం అవ్వగలగటానికి ప్రధాన కారణం తెర వెనుక క్రిష్ బృందం చేసిన కృషే! ఆయన దర్శకుడిగా మొత్తం టెక్నీషియన్స్ అందర్నీ శాతకర్ణి స్థాయిలోనే యుద్ధ రంగంలోకి దింపాడు. దర్శకుడిగా, కథకుడిగా క్రిష్ ఎక్కడా అయోమయపడలేదు. శాతకర్ణి గురించి లభ్యమవుతోన్న చారిత్రక అంశాలన్నిటిలో సినిమాకు తగిన వాటినే సమర్థంగా ఎంచుకుని ప్రజెంట్ చేశాడు. అలాగే, ఆయన రాసుకున్న సన్నివేశాలకి మాటల రచయిత, గీత రచయిత తమ పదాలతో ప్రాణం పోశారు. సినిమాటోగ్రఫి కూడా గౌతమీ పుత్ర శాతకర్ణికి అతి పెద్ద వరం. కెమెరాతో అద్భుతం ఆవిష్కరించారు. భారీ యుద్ధాలు మొదలు భార్యా, భర్తల మధ్య సంఘర్షణల వరకూ అన్నీ మనసుకు హత్తుకుపోతాయి సినిమాలో. అలాగే, చారిత్రక చిత్రమైన గౌతమీ పుత్రలో ఆర్ట్ వర్క్ కూడా మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఇక సంగీతం అడుగడుగునా ఆకట్టుకుంటుంది. కాకపోతే, యుద్ధ సన్నివేశాల్లో సంగీత దర్శకుడు మరింత దృష్టి పెట్టి నేపథ్య సంగీతం ఇవ్వాల్సింది. మొత్తం మీద, ఒక రాజమౌళి స్థాయి సంవత్సరాల తరబడీ తీయాల్సిన మాస్టర్ పీస్ ని కేవలం కొన్ని నెలల వ్యవధిలో మనకు అందించిన క్రిష్ , అతని సాంకేతిక బృందం ఖచ్చితంగా అందరూ అభినందించాల్సిన వారే!

ప్లస్ పాయింట్స్ :

శత చిత్ర కథానాయకుడు బాలకృష్ణ
గౌతమీ బాలాశ్రీగా నటించిన డ్రీమ్ గాళ్ హేమామాలిని
శాతకర్ణి శ్రీమతిగా మెప్పించిన శ్రియ
అద్భుతాన్ని అత్యంత వేగంగా ఆవిష్కరించిన క్రిష్

మైనస్ పాయింట్స్ :

యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ
యుద్ధ సన్నివేశాల్లో లోపించిన భావోద్వేగం
మరింత గాఢంగా పండాల్సిన నేపథ్య సంగీతం

CineDhol Perspective :

ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం… ఇక ఉనికిని చాటుదాం!
గౌతమీ పుత్ర శాతకర్ణి తరువాత టాలీవుడ్ ఖచ్చితంగా ఇలా భావించే అవకాశం వుంది! ముందు ముందు మరిన్ని గొప్ప చిత్రాలకు ఆస్కారం కలిగింది. శాలివాహన శకం లాగే తెలుగు సినీ చరిత్రలోనూ ఒక నూతన శకం ఆరంభమైంది!

<!–

Read more

–>

About the author

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

5,739 Comments

Click here to post a comment